Saturday, 20 June 2015

అన్ని తానై

భయమేసింది  ఒక్కసారిగా ఎందుకో.
కొంచం పరిశీలిస్తే  'ధడ్ ' 'ధడ్ 'మని  చప్పుడు.
ఎక్కడినుంచో  తెలిసిపోయింది  పెద్ద  శ్రమలేకుండానే.
చదువుకున్న నాలుగు ముక్కలు చెప్పాయి ఉపయోగపడి  ' గుండె' నుండి అని.
'గుండె ' ని అడిగా ఏంటిది అని?
'' ఆ 'ధడ్ ' 'ధడ్ ' నా  గస .  వాస్తవంగా 'లబ్ -డబ్ ' చప్పుడు నా ఊపిరి. అలా చప్పుడు చేస్తూ కొట్టుకోవడం నా కర్తవ్యం . నేను అలా గట్టిగా కొట్టుకోవడం నీ భయానికి సూచన మాత్రమే కానీ అసలు భయం కాదు. అయినా  నన్ను అడగమని చెప్పిన 'మెదడు' ను అడుగు '' అంది.

పరుగు తీసా మెదడు దగ్గరికి గుండె చేసిన సిఫార్సు  తో .
అదే ప్రశ్న వేసా 'ఏంటిది' అని.
'' ఆలోచించడం నా కర్తవ్యం .
అదే చేశా నేను!
ఆపేయమంటావా?
ఆలోచించుకో... అప్పుడు  నీకు నువ్వు వేసుకున్న చెప్పుకి పెద్ద తేడా అంటూ ఉండదు. '' అని హితము  భోదించింది.

అలా నా గుండె, మెదడు రెండు నన్ను ఒంటరి వాడిని చేసి వాటి పనుల్లో అవి మునిగిపోయాయి.
ఇంకా ఆ భయం వెంటాడుతూనే ఉంది.

ఎవ్వరని  అడగను?
ఏమని అడగను?

కాళ్ళు కూడా వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి!
మధ్యమధ్యలో  తాకితే కాని వీచిందని తెలియని గాలి చేసే చప్పుడు లాగా ఏదో వినిపిస్తుంది.
గ్రహించే లోపే నా కాళ్ళు నన్ను అప్రయత్నంగా ముందుకు లాక్కపోతునాయి.
నా  అవయవాల నియంతృత వైఖరి  నా మీద .
ఆ వినబడడం కూడా వెలుతురు- చీకటి సంభోగించుకునే చోట ప్రారంభం అయ్యి , చిక్కటి వెలుతురు లో చక్కగా వినబడి , చీకట్లో చెవికి అందకుండా పోతుంది.

అన్ని అవయవాల నియంతృత్వపు నిర్దాక్షిణ్యం లో మెదడుది  చివరి స్థానం .
అందుకే  ఈ మాత్రం పరిశీలించి , గ్రహించగల్గుతున్నా .

కష్టాన్నోర్చి , దీక్ష  చేస్తే గాని  తెలియలేదు ఆ వినబడుతున్న చప్పుడు, ఆ చప్పుడు చేస్తున్నది నా 'నీడ' అని.
ఉన్న క్షణం లో  ఆగీపోయా !
కాలం కలిసొచ్చి  క్షణం సహాయం చేస్తే - నేను స్ట్రీట్ లైట్ కింద చిక్కటి వెలుతురులో నిలుచున్నా.
ఆగితే గుండె దడ తగిలింది.
నా నీడలు నాలుగైయాయి  స్ట్రీట్ లైట్ నడి  నెత్తిన ఉండడం పుణ్యాన.
ఇప్పుడు సరిగ్గా వినపడ్తోంది  నా నీడ మాట .
''ఎవ్వరు నువ్వు ?'' అని అడిగా నా  నీడను.
''నీ మనస్సునే నేను'' అంది!
''మనస్సు అంటే?'' అని అడిగా.
''గుండెకి  మెదడుకి మధ్య ఉండే  ఛేదించలేని  రహస్యాన్ని '' అంది.
సమాధాన పడ్డ అవశేషాలేవి  నా మొహాన  కనపడకపోవడం తో '' నీలో భయాన్ని నేనే'' అని   మనస్సె  మాట్లాడ్తోంది .
ఈ సమాధానం తో నా భయం తొలిగింది.
మనకి సమాధానం కన్నా  కావాల్సింది మన కష్టాలకి కారకాలు అని అనిపించింది.
ఇక్కడ నాకు నా భయానికి బాధ్యత వహించే  కర్త!
''నీలో భయానికి కారణం కూడా నేనే'' అంటూ మొదలుపెట్టిన మనస్సు. . .
'' అడుక్క తెచ్చుకున్నావ్  నీలో జీవాన్ని . ఆ  అర భాగం ఒక శుక్రకణం  నుంచి ,
ఈ అర భాగం ఒక  అండం  నుంచి.
నీ అడుక్క తెచ్చుకున్న బ్రతుక్కి  అహంకారం , గుర్తింపు  అద్దింది నేనే !'' అని అంది.

'' ఈ భయాన్ని భరించేదెలా ?
నిన్ను వదులుకునేదెలా ?'' నా(??) చివరి  ప్రశ్న.

''అది అవ్వదు. కృష్ణుడు  చెప్పిన ఆత్మ లో ఆసాంతం ఉండేది నేనే .
ఆ బాధ్యతకు  రెండు మాటలు.
ఒకటి- నన్ను దాటేయడం!
రెండు- నన్ను ఆమోదించడం. ఆలింగనం చేస్కోవడము.

మొదటిది నిన్ను  ఋషిని చేస్తే ,
రెండోది నిన్ను మనిషిని  చేస్తుంది.

మొదటిది నీకు మోక్షాన్ని చూపిస్తే
రెండోది  నీకు  సౌష్టవమైన జీవితాన్ని ఇస్తుంది.
వాయు గొట్టాలు , రక్త నాళాలు  నీలోనే కాదు పీనుగు లో కూడా ఉంటాయి.
ఛాయస్ ఇస్ యౌర్స్,
చూజ్ ఇట్ట్.
క్లెయిమ్ ఇట్ట్.
ఈ ప్రపంచం లోకి వస్తూనే ' పుట్టడం' అనే అరుదైన అనుభవాన్ని పొందిన  మహానుభావివి నువ్వు - మనిషివి నువ్వు!''  అని  అంది.
అన్ని తానై  మాట్లాడేసింది  మౌనంగా మనస్సు.
భయం  పూర్తిగా తగ్గి అవయవాలు  ఆధీనంలోకి వచ్చాక  పరుగున కాగితం మీద ఇదంతా పారబోయాలని తపన.

సెకండ్స్ ముల్లు కలం కొన రెండు పోటి పడి కదిలాయి.
తపన తీరిపోయి కూర్చున్న చోట నుంచి లేచి వెళ్తూ వెనక్కి తిరిగి చూసుకుంటే - భావాల బరువుని , కత్తి లాంటి కలం కొనని  ఒర్చుకున్న కాగితం  నా చేయి అదుము  తప్పగానే  వీచిన ఫ్యాన్ గాలిలో ఊపిరి తీసుకుని మల్లీ జీవం వచినట్టై  అట్టా మీద నుంచి  ఒక్కసారిగా  లేచి కూర్చుంది.

No comments:

Post a Comment